ధోనీ ఉంటే మ్యాచ్ లు గెలిపించేస్తాడు అని కాదు కానీ ధోనీ ఉంటే ఓ ధైర్యం. కానీ నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ అవుటైన తీరు మాత్రం వివాదాస్పదంగా మారింది. పేకమేడలా చెన్నై వికెట్లు కోల్పోతుంటే ధోనీ మాత్రం యథావిధిగా తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చాడు. అప్పటికే 14.2 ఓవర్లు ఆడిన చెన్నై కేవలం 72పరుగులు మాత్రమే చేసి 7వికెట్లు కోల్పోయింది. ఇలాంటి టైమ్ లో...అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న చెన్నై అభిమానులకు ఓ చిన్న ఆశ. ధోనీ నిలదొక్కుకుంటే లాస్ట్ ఓవర్లలో బ్యాట్ ను ఝుళిపిస్తే చెన్నై ఓ 120 పరుగులు చేస్తుంది...అప్పుడే కాస్త కేకేఆర్ కు ఫైట్ అన్నా ఇవ్వొచ్చు అని. బట్ అనుకున్నది జరిగితే క్రికెట్ ఎందుకు అవుతుంది. సునీల్ నరైన్ బౌలింగ్ లో ధోనీ ఎదుర్కొన్న నాలుగో బంతి అతని ప్యాడ్స్ ను తాకింది. నరైన్ LBW కి అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చేశాడు. క్షణం కూడా వెయిట్ చేయకుండా ధోని DRS తీసుకున్నాడు. డీఆర్ఎస్ లో తేలింది ఏంటంటే నరైన్ వేసిన బాల్ ధోని బ్యాట్ అంచును తాకుతున్నట్లుగా స్నికో మీటర్ లో స్పైక్స్ కనిపించాయి. కానీ అది సైడ్ నుంచి కనిపిస్తోంది. ఫ్రంట్ కెమెరాలో చూసినప్పుడు బ్యాట్ కి బాల్ కి మధ్య డిస్టెన్స్ ఉన్నట్లు థర్డ్ అంపైర్ భావించాడు. అందుకే ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన అవుట్ ను పరిగణనలోకి తీసుకుని స్నికో మీటర్ లో స్పైక్స్ కనిపించినా కూడా అవుట్ ఇచ్చాడు. ధోని నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఫలితంగా 75పరుగులకే 8వికెట్లు కోల్పోయింది చెన్నై. ఇక్కడ స్నికోలో స్పైక్స్ కనిపించినా బెనిఫిట్ డౌట్ ఉన్నా బ్యాటర్ కి అనుకూలంగా డెసిషన్ ఉండాలి కానీ ఆన్ ఫీల్డ్ అంపైర్ డెసిషన్ నే కన్సిడర్ చేయటంపై ధోని ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. అంత క్లియర్ గా టెక్నాలజీ యూజ్ చేసినా అందులో బ్యాట్ కి తాకినట్లు కనిపిస్తున్నా ఎలా అవుట్ ఇస్తారంటూ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ లో కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అంపైర్ తో డిస్కషన్ చేయటం కూడా కనిపించింది. ఏదైతేనేం ధోనీ అవుటైపోయాడు. చెన్నై విసిరిన 104 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ పది ఓవర్లలోనే ఉఫ్ మని ఊదేసి చరిత్రలో లేని విధంగా చెన్నైకు వరుసగా ఐదో ఓటమి దక్కింది.